🇮🇳 పద్మశ్రీ శోభానాయుడు కూచిపూడి - నాట్య గురువు 

మన సాంస్కృతిక రాయబారి పద్మశ్రీ శోభానాయుడు. కూచిపూడి నాట్యానికే ఆమె విన్యాసము, ఓ నుడికారము, ఆంగికము, అభినయనంలో ఆమె ఆరితేరిన కళాకారిణి, కనులలోన, కనుబొమలలోన అవలీలగా అభినయాన్ని పంచగల విద్యత్ ఆమెది. తెలుగు ఆటకు, పాటకు, పర్యాయపదంగా మారిన శోభానాయుడు అకుంఠిత దీక్ష అసమాన దక్షత అద్భుతమైన నర్తకి అసమాన నాట్యగురువు నృత్యచూడామణి శోభానాయుడు అభినయ వేదాన్ని సభకు పరిచయం చేస్తోందా అన్నట్లు ఉంటుందామో నాట్యం, ఆమె నర్తిస్తే ఆమె కాలి అందియల, సిరిసిరిమువ్వలు, సిరివెన్నెలలు కురిపిస్తాయి. ఆమె ముగ్ధ మనోహర కనుద్వయం ఎన్నో కథనాలను అలవోకగా వివరిస్తాయి. కూచిపూడి నాట్యరీతిలో శోభానాయుడు చేసిన ప్రయోగాలెన్నో, తన ప్రతిభా పాటవాలతో పొందిన సత్కారాలెన్నో! బ్యాలెలు ఆమె చేస్తేనే వాటికి అందం, ఔచిత్యం.

శోభానాయుడు గారు విశాఖజిల్లా అనకాపల్లిలో తెలగ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుండి ఆమెకు నాట్యంపై మక్కువ. ఆమె తల్లి సరోజనీదేవికి కూతురిని నాట్య కళాకారిణిని చేయాలని పట్టుదల ఎక్కువగా ఉండేది పెంపటి చినసత్యం దగ్గర నాట్యం అభ్యసించి గురువుకు తగ్గ శిష్యురాలనిపించుకుంది. ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆమెకు నాట్యాభ్యాసానికి అన్నీ ప్రతిబంధకాలే అన్నీ ప్రతికూల పరిస్థితులే. అయినా తల్లి ప్రోత్సాహంతో రాజమండ్రిలో తొలుత పి. ఎల్. రెడ్డి అనే గురువుగారి దగ్గర నాట్యాన్ని అభ్యసించసాగారు, అరంగ్రేటం రోజుకు ఆ గురువుగారు కనిపించకుండా పోయారు.

తరువాత అదేమని అడిగితే శోభానాయుడుకి నాట్యం అబ్బదని చెప్పాడు. ఆ మాటలు చిన్నారి శోభను గాయపరిచాయి అయినా గురువు చిన్నబుద్ధికి కృంగిపోకుండా మరింత దృఢంగాచేసుకుంది. కూచిపూడి నాట్యం అభ్యసించి మేటినర్తకి ఎదగాలని, మేలైన శిక్షణ కోసం, శోభానాయుడిని తీసుకొని మద్రాసుకు ఆమె తల్లి మకాం మార్చి, నాట్యం కోసం ఇంటికి సంసారానికి దూరంగా కుమార్తెను తీసుకుపోయి అందునా సినిమా రంగానికి సమీపమునకు వెళ్ళడం ఇప్పటిలా సులభమైన పనికాదు. పైగా ఘోషా పరదా పద్ధతులున్న తెలగనాయుడు కుటుంబం, బంధువుల నుండి సూటిపోటి మాటలు ఎదురయ్యేవి. కొందరు సూటిగానే ప్రశ్నించేవారు. మరికొందరు మద్రాసుకెందుకు, సినిమాల్లో చేరుస్తారా! అని ఆక్షేపించిన వారున్నారు.

కూచిపూడి నాట్యము మహా మహోధ్యాయులుగా వినుతికెక్కిన వెంపటి చినసత్యం తన కాలి అందెల రవళులతో లోకాన్నంతా సమ్మోహన పరచాలన్న కసితో ఉన్న శిష్యురాలు శోభానాయుడు ఇద్దరికి మేలు కలయిక.

విల్లుకు, బాణానికి ఉన్న అనుబంధం వంటిని, వెంపటి చినసత్యం. శోభానాయుడు భుజంపై తుపాకి పెట్టి లోకాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు. శోభానాయుడు నాట్య అభ్యాసానికి శ్రీకారం చుట్టింది. సాగరమధనం చేసిన రీతిలో నాట్యార్దవాన్ని గురుశిష్యులిద్దరూ చిలకసాగారు. శోభానాయుడు ప్రతిభ సినిమారంగ ప్రముఖులకు కూడా చేరింది.

బి.ఎన్. రెడ్డి వంటి ప్రసిద్ధ దర్శకులు సైతం తన సినిమాలో నృత్య ప్రధానమైన పాత్రవేయమని ఆమెను అడిగారు. సంతకం చేసిన బ్లాంకు చెక్కు యిస్తూ నీవు కోరినంత డబ్బు వ్రాసుకో అని భారీ పారితోషకం ఇవ్వచూపారు. మల్లేశ్వరి, బంగారుపాప, రంగులరాట్నం వంటి చిత్రాలలో మేటి కళాత్మక దర్శకుడిగా అలరారుతున్న బి.ఎన్.రెడ్డి గారి అవకాశం కోసం పరిశ్రమంతా అర్రులు చాస్తున్న కాలం అది పైగా నచ్చినంత పారితోషికం ఎవరికి దక్కని, ఎవరూ ఊహించని అవకాశం అయితే ఊహించని సమాధానం బి.ఎన్.రెడ్డికి ఎదురయ్యింది. అదేమిటంటే ఆయన ఇచ్చిన అవకాశాన్ని శోభ మృదువుగా తిరస్కరించారు. తన జీవితం కూచిపూడి నాట్యానికే అంకితమని తన కళాసేవకు సినిమాలు, ఆటంకం కలిగిస్తాయని అందుకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనని, డబ్బు ముఖ్యం కాదని, ఆమె తెగేసి చెప్పగా దిగ్గజ దర్శకుడు బి.ఎన్.రెడ్డి, సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు, గౌరవంగా లేచి నిల్చుని "నాట్యకళ పట్ల నీ నిబద్ధతతకు నమస్కారము తల్లి, నీ పట్టుదల ఇలాగే కొనసాగించు గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధిస్తావు" అంటూ దండం పెట్టి మరీ వెళ్ళాడు.

కళాతపస్వి కె. విశ్వనాధ్ గారు నృత్య ప్రధానమైన ఇతివృత్తాలతో సిరి, సిరిమువ శంకరాభరణం సినిమాలు తీస్తున్న సందర్భములో శోభానాయుడిని కథానాయిక పాత్రకు అడిగారు. అలాగే కన్నడ దర్శకులు, జి.వి. అయ్యర్ "హంసగీతే" చిత్రం తీస్తున్నపుడు కూడా శోభానాయుడుకే మొదటి ప్రాధాన్యత నిచ్చారు. పెద్ద పారితోషకాలు ఆశ చూపి ఆమె పట్టు సడలలేదు. కూచిపూడికే తాను అంకితం అని తెగేసి చెప్పేవారు. ఆ మాట ఆమె ఎప్పుడూ తప్పలేదు.

పుష్కరకాలం పాటు కఠోరసాధన తరువాత ఆమె పోషించిన పాత్రలు కలికితురాయిల్లా భాసిల్లాయి, సత్యభామ, పద్మావతి, చండాలిక వంటి పాత్రలు పోషణలో ఆమెకు ఆనే సాటి. అలాగే నృత్యనాటికల ప్రదర్శనలో ఆమే మేటి. సోలోగా వందకు పైగా ప్రదర్శనల ఇచ్చారు. నృత్యరూపకాల ప్రదర్శనలో శోభానాయుడు అందెవేసిన చేయి.

భామాకలాపం, శ్రీనివాస వెంకటేశం, విప్రనారాయణ, క్షీరసాగరమదనం, నవరస నటభామిని, విజయోస్తు నారీ, శ్రీకృష్ణ శరణం మమ, మేనకా విశ్వామిత్ర, శ్రీకృష్ణ పారిజాతం మున్నగు బాలేలు, ఆమె దర్శకత్వంలో అభినయంతో రూపుదిద్దుకొని ప్రేక్షకులకు కన్నుల పండుగ చేశాయి.

రవీంద్రనాథ ఠాగూరు రాసిన "చండాలిక” నృత్యరూపకం శోభానాయుడు ప్రయోగశీలతను ప్రపంచానికి చాటింది.

షిర్డిసాయిబాబా బ్యాలెను శోభానాయుడు సంకల్పించినపుడు విమర్శలు ఎదుర్కొన్నారు. సాయిబాబాతో గెంతులు వేయిస్తావా అని అడిగినవారున్నారు. కానీ ప్రదర్శన చూశాక ఆమెను వారే అభినందించారు షిర్డీసాయి బాబా నృత్యరూపకం తలపెట్టినపుడు శోభానాయుడుకు ఏదో ఆత్మవిశ్వాసం నడిపించింది. ఆమెకు ఒక మూల తాను బాలా పాత్రను బ్యాలేగా మలచడంలో కృతకృత్యురాలిని కాగలనా అని శంక ఉండేది. అయితే సాయిబాబా వేషం వేసుకొని వేదికపైన దీపకాంతుల మధ్యకు వస్తూనే ఆమెలో యెనలేని శక్తి. బాబా సాక్షాత్కారం పొందినంత ఉద్వేగం బాబా ఆజ్ఞ లేనిదే తాను బాబా పాత్రను అంత బాగా పోషించడం అసాధ్యమన్నది. ఆమె నిశ్చితాభిప్రాయము; బాబా ఆశీస్సులు లేకపోతే ఆ రూపకం అంతగా రక్తి కట్టేది కాదని కూడా శోభానాయుడు విశ్వాసం, బాబా రూపకం మానుకో అని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ హితవు చెప్పినవారంతా ప్రదర్శన ముగిశాక ఆమెనెందరో వెన్నోళ్ల అభినందించారు.

శోభానాయుడు ఎన్ని పాత్రలలో అభినందించినా, సత్యభామ పాత్ర అంటే చాలా ప్రేమ, సత్యభామ జడభారతం కూచిపూడికే ప్రత్యేకం, అది శోభానాయుడు వెలికితీసి మళ్లీ సజీవంగా నిలిపారు. జడభారతాన్ని శోభ అభినయిస్తే చూడడానికి రెండు కన్నులు చాలవంటారు.

కూచిపూడి నాట్యానికి శోభానాయుడు చేసిన సేవలకు ఆ నాట్యరీతి అభివృద్దికి ఆమె చేసిన కృషికి జరిపిన ప్రయోగాలను గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం 2001లో ఆమెను "పద్యశ్రీ" పురస్కారంతో గౌరవించుకుంది. నాట్యగురువు వెంపటి సత్యం స్థాపించిన కూచిపూడి ఆర్ట్స్ అకాడమి హైదరాబాద్ శాఖకు 1980 నుండి ప్రిన్సిపాల్గా శోభానాయుడు వ్యవహరిస్తున్నారు. తన కళను విద్యను, ఎందరో శిష్యురాళ్లకు అందిస్తూ కూచిపూడి నాట్యాన్ని నిత్య నూతనంగా మెరిపిస్తున్నారు. గురు శిష్య పరంపరను కొనసాగిస్తున్నారు. మహానర్తకి, మహా నాట్యాచార్యులు పద్మశ్రీ శోభానాయుడు. మన జాతి సాంస్కృతిక రంగానికే కళా, కాంతి తెచ్చిన దిగ్గజం.

భరతఖందంలో ఉద్భవించిన అధ్యాత్మిక గొప్పతనాన్ని జగతి నలుచెరగులా ప్రచారం చేసి మనమంతా గర్వంగా తలెత్తుకునేలా చేసిన మహనీయుడు స్వామీ వివేకానందపై శోభానాయుడు రూపొందించిన నృత్యరూపకంతో ఆమెకు అసాధ్యం అనేదే లేదని ప్రపంచానికి తెలిసింది.

శోభానాయుడు అందెల రవళికి ప్రతిస్పందించని తీరం లేదు. ఆమె నాట్య వైదుష్యంతో పులకించని కళావేదిక లేదు. దేశవిదేశాల్లో కోకొల్లలుగా అభిమానులున్నారు. ఆమె శిష్యులు, ప్రశిష్యులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

తానా నిర్వహణలో అమెరికాలో పర్యటించిన శోభానాయుడు, అనేక నాట్య ప్రదర్శనలతో అక్కడి వారిని అలరించారు. ఇంగ్లండు రష్యా, సిరియా, టర్కీ హాంగ్కాంగ్, బాగ్దాద్, కంపూచియా, బాంగ్ కాక్ దేశాల్లో జరిగిన అనేక సాంస్కృతికోత్సవాల్లో శోభానాయుడు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ చక్కటి ప్రదర్శనలిచ్చారు.

భారతప్రభుత్వం తరఫున వెస్ట్ ఇండీస్, మెక్సికో, వెనెజుల ట్యూనిస్, క్యూబా దేశాల్లో పర్యటించిన సాంస్కృతిక బృందాలకు శోభానాయుడు నాయకత్వం వహించారు.

శ్రీనివాస కళ్యాణం బ్యాలేలో పద్మావతిగా శోభానాయుడు కనపరచిన ప్రతిభా పాటవాలకు మెచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు. దేశవ్యాప్తంగా ఆమె నాట్య కార్యక్రమాలు అనేకం ఏర్పాటు చేశారు. అలాగే శోభానాయుడు రూపొందించి ప్రదర్శించిన కొన్ని నృత్య రూపకాలను వీడియో చిత్రాలుగా భద్రపరచడానికి కావలసిన ఆర్ధిక సహాయాన్ని కూడా టి.టి.డి అందించింది.

టి.టి.డి వారి శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానల్లో యువ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో శోభానాయుడు "సాధన" అనే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. అలాగే సంస్కృతి ఛానెల్లో కూడా యువకళాకారులకు మార్గనిర్దేశనం చేసేందుకు గాను ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

పురస్కారాలు - సత్కారాలు :

1. 1982 - మద్రాసు, కృష్ణ గానసభ వారి నుండి "నృత్య చూడామణి”

2. 1991 సం॥లో ముంబాయిలోని శ్రీ శృంగార సంసద్ వారి నృత్యవిహార్ పురస్కారం

3. 1991 - కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు

4. 1996 - మద్రాసు నుంగంబాకు సాంస్కృతిక సంఘం వారి నృత్య కళాశిరోమణి పురస్కారం.

5. 1998 - ఎన్.టి.రామారావు పురస్కారం & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస అవార్డు.

6. 2001లో భారత కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం.

దేశ విదేశాలలో ఇంకా ఎన్నెన్నో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు.

 సేకరణ,రచయిత-భట్టరుశెట్టి పద్మారావు రాయలు